రుణమాఫీపై గందరగోళం.. రైతులకు తెలియకుండానే కొత్త ఖాతాలు!

  • రుణమాఫీపై స్పష్టత ఇవ్వని బ్యాంకు అధికారులు
  • అయోమయంలో చేర్యాల రైతులు
  • ఎస్‌బీఐ సిబ్బంది దరుసు ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహాం

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రైతులను గందరగోళానికి గురి చేస్తోంది. లక్ష రూపాయల వరకు మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుంటే…బ్యాంకు అధికారులు మాత్రం ఇంకా కాలేదని రైతులను తిరిగి పంపిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే.. మీకు రుణమాఫీ కాదంటూ తెగేసి చెబుతున్నారు. అలా ఎలా అని నిలదీస్తున్న రైతులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. రైతులకు తెలియకుండానే కొత్త ఖాతాలను తెరుస్తూ..అందులో రుణమాఫీ సొమ్ము జమ కాలేదని వెల్లడిస్తున్నారు. దీంతో అసలు రుణమాఫీ సొమ్ము ఏ ఖాతాలో పడుతుందో..అసలు పడిందో లేదో తెలియడం లేదంటూ పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.

కాగితాలపై సంతకాలు..కొత్త ఖాతాలతో మోసం
సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన పలువురు రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం మాత్రం అందరికి రుణమాఫీ చేశామని ప్రకటించడంతో.. రైతులంతా బ్యాంకులకు పోటెత్తారు. తీరా చూస్తే..చాలా మందికి రుణమాఫీ కాలేదు.

ఏమైందని అడిగితే.. బ్యాంకు అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. కొంతమంది రైతులకైతే..మీరు కొత్త ఖాతా తెరిచారని, రుణమాఫీ సొమ్ము జమకాదని చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం తాము కొత్తగా ఖాతాలే తెరువలేదని అంటున్నారు. లోన్‌ రెన్యూవల్‌ పేరుతో బ్యాంకు అధికారులు తమ సంతకాలు సేకరించారని.. ఆ తర్వాత పాత అకౌంట్లని క్లోజ్‌ చేసి..తమకు తెలియకుండానే కొత్త ఖాతాలను తెరిచారని రైతులు ఆరోపిస్తున్నారు. చదువురాని పేద రైతులను చూసి బ్యాంకు అధికారులు మోసానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.

ఎస్‌బీఐ సిబ్బంది దురుసు ప్రవర్తన
మండలానికి చెందిన పలువురు రైతులకు రుణమాఫీ అయిందని ఫోన్‌కి మెసేజ్‌ రావడంతో బ్యాంకులు వెళ్లారు. బ్యాంకు అధికారులు మాత్రం రుణమాఫీ సొమ్ము పాత అకౌంట్‌లో జమ అయిందని.. అది నిపివేసిన కారణంగా ఆ సొమ్మంతా తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుందని చెబుతున్నారు. కొత్త ఖాతాలోకి జమ అయితేనే మాఫీ అవుతుందని చెబుతున్నారు.

అయితే రైతులు మాత్రం కొత్త అకౌంట్‌ ఎలా వచ్చిందని బ్యాంకు అధికారులను నిలదీస్తున్నారు. అల్రెడీ ఒక ఖాతా ఉన్నాక..మరో ఖాతా ఎవరిని అడిగి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం రైతులే కొత్త ఖాతా తెరిచారని చెబుతున్నారు. పాత, కొత్త అకౌంట్లతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. రైతులకు సమాధానం చెప్పాల్సిన బ్యాంకు అధికారులు మాత్ర..వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సెక్యూరిటీ పిలిచి మరి రైతును బయటకు పంపిస్తున్నారు. బ్యాంకు అధికారుల తీరు పట్ల మండలంలోని రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు