కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ రివ్యూ


 
‘బలగం’తో రమేష్ ఎలిగేటి రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ వెబ్ సిరీస్‌తో ఆయన ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ట్విస్ట్ ఏమిటంటే… ‘బలగం’ సినిమా ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా అయితే, ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ వెబ్ సిరీస్ తెలంగాణ నేటివిటీతో కూడిన మాఫియా డ్రామా. దీనికి బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించారు. సాయి సూరేపల్లి, అమన్ సూరేపల్లి, అనిరుద్ టి, గోపాల్ ఎం ప్రధాన పాత్రలు పోషించారు. ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. 

కథ

(సాయి సూరేపల్లి) కరీంనగర్ పట్టణంలో ఓ సాదాసీదా యువకుడు. తమ్ముడు టింకు (అమన్ సూరేపల్లి), ఫ్రెండ్స్ బిట్టు (అనిరుద్ ఎం) & సత్తి (గోపాల్ మాదారం)తో కలిసి వ్యాపారం చేయాలని అనుకుంటాడు. అయితే… డబ్బులు లేక, బ్యాంకులో అప్పు రాక లోన్ రికవరీ ఏజెంట్లుగా మారతారు. చివరకు అదీ వదిలేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాలని అనుకుంటారు. అప్పుడు 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటిస్తారు. స్థలం కొనడం కోసం అందరూ కలిసి పోగు చేసుకున్న 30 లక్షలను మార్చుకోవడానికి బ్యాంకుకు వెళతారు. రూల్స్ గురించి అవగాహన వస్తుంది. పైలోకాలకు వెళ్ళిన వ్యక్తుల ఆధార్, ఐడీ కార్డులు ఉపయోగించి బ్యాంక్ అకౌంట్స్ తెరుస్తారు. నోట్లు మార్చుకుంటారు. అయితే… ఆ అకౌంట్స్ నుంచి మరో ఐదు కోట్ల రూపాయల నోట్లు మారతాయి. ఆ కేసులో గని అండ్ గ్యాంగ్ అరెస్ట్ అవుతారు. అసలు ఐదు కోట్లు మార్చింది ఎవరు? ఈ కేసుకు ఎమ్మెల్యే పురోషోత్తం (శ్రీవర్ధన్)కు సంబంధం ఏమిటి? బ్యాంకు మేనేజర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? జైలు నుంచి గని అండ్ గ్యాంగ్ బయటకు వచ్చిన తర్వాత మాఫియాగా ఎలా ఎదిగారు? అనేది ‘ఆహా’లో సిరీస్ చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ

ప్రతి మనిషి జీవితంలో యవ్వనం చాలా కీలకం. చదువు పూర్తయిన తర్వాత జీవితంలో సెటిల్ అయ్యే పీరియడ్ ఎంతో ముఖ్యమైనది. అది మనిషి మిగతా జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఆ విషయాన్ని అంతర్లీనంగా స్పృశిస్తూ, ఓ సందేశం ఇస్తూ… రెగ్యులర్ ఫార్మటులో కమర్షియల్ విలువలతో తెరకెక్కించిన సిరీస్ ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’.

‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’కు రమేష్ ఎలిగేటి రైటర్ అయినప్పటికీ… ఆయన రాసిన ‘బలగం’ చిత్రానికి, దీనికి సంబంధం లేదు. రెండిటిలో కామన్ పాయింట్ ఒక్కటే… తెలంగాణ నేటివిటి. రమేష్ ఎలిగేటి తన రచనలో కొత్త కోణాన్ని ఈ సిరీస్ ద్వారా ఆవిష్కరించారు.

బలగం, కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్… ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ డైరెక్షన్! కొత్త ఆర్టిస్టులు, పరిమిత వనరులతో బాలాజీ భువనగిరి మంచి సిరీస్ తీశారని చెప్పాలి. ఆయన దర్శకత్వంలో కమర్షియల్ టచ్ ఉంది. జైలు నుంచి గని బయటకు వచ్చిన తర్వాత తీసిన సీన్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు ఏమాత్రం తక్కువ కాదని చెప్పాలి. ఆర్టిస్టులు కొత్తవాళ్లు అయినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి చక్కటి నటన రాబట్టుకున్నారు. ఆయనది కరీంనగర్ కాదు అయినా సరే ఆ ఏరియాను చాలా అందంగా తెరపై చూపించారు. బాలాజీ భువనగిరి దర్శకత్వంలో రియలిస్టిక్ అప్రోచ్ బాగుంది.

ఇందులో మనిషి స్వార్థం హైలైట్ అవుతుంది. ఆ అంశంతో పాటు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఏ విధంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తారనేది కూడా చూపించారు. సిరీస్ స్టార్టింగ్ సోసోగా ఉన్నప్పటికీ, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. సీక్వెల్ కోసం లీడ్ అన్నట్లు ఒక పాయింట్ వదిలేశారు. దానిని ఎలా డీల్ చేస్తారో చూడాలి. లెంగ్త్, ఎక్కువ క్యారెక్టర్లలో తెల్సిన ముఖాలు లేకపోవడం మైనస్ పాయింట్స్. కెమెరా వర్క్, మ్యూజిక్ ఓకే. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. అంతా కరీంనగర్ టౌన్ ఏరియాలలో షూటింగ్ చేశారు. ఒక విధంగా తెలంగాణ మూలాలను ఆవిష్కరించే విధంగా తీసిన తొలి వెబ్ సిరీస్ ఇది అని చెప్పవచ్చు. మాటల్లో తెలంగాణ ఫ్లేవర్ కనిపించింది.

ఎవరెలా చేశారంటే?

తెలంగాణ యాస, భాషను పట్టుకున్న సాయి సూరేపల్లి, గని క్యారెక్టర్లో బాగా నటించాడు. ప్రతి సన్నివేశంలోనూ సహజంగా కనిపించాడు. అతని నటన చూస్తే కొత్త కుర్రాడు చేసినట్లు అనిపించదు. సాధారణ యువకుడి నుంచి కరీంనగర్ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదిగిన మార్పును చక్కగా నటనలో, ఆహార్యంలో చూపించారు. సాయి సూరేపల్లికి అతని తర్వాత మెయిన్ లీడ్స్ అమన్, అనిరుద్, గోపాల్ నుంచి చక్కటి సహకారం అందింది. మెయిన్ లీడ్స్ నలుగురితో పాటు ఎమ్మెల్యేగా నటించిన శ్రీవర్ధన్, మిగతా ఆర్టిస్టులు చాలామంది కొత్త వాళ్ళు అయినప్పటికీ అనుభవం ఉన్న నటీనటుల తరహాలో ఆయా పాత్రలకు ప్రాణం పోశారు.

ఓవరాల్‌గా ఈ వారం ఓటీటీల్లో నేటివిటీతో కూడిన చక్కటి సిరీస్ చూడాలని కోరుకునే వీక్షకులకు ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ ఆహా అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో మిగతా చిన్న చిన్న పట్టణాలను నేపథ్యంలో కూడా సిరీస్ లేదా సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించవచ్చు అనే సందేశాన్ని ఈ ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ ఇస్తుంది.